• సినిమాగా రాజీవ్, సోనియా లవ్ స్టోరీ!
  Published Date : 17-Feb-2017 7:00:25 IST

  దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీల ప్రేమకథను ఒక షార్ట్ ఫిల్మ్ గా తీస్తున్నాడొక యువ సినీ రూపకర్త. ఇందులో కరణ్వీర్ బోరా రాజీవ్ గాంధీగా, ప్రియా బెనర్జీ సోనియా గాంధీగా నటించబోతున్నారు. ఈ లఘుచిత్రానికి ‘ఇజాజత్ టైటిల్ను ఖరారు చేశారు. సోనియా, రాజీవ్ల ప్రేమకథ కేవలం ఓ ప్రేమకథగానే రాబోతోందని ఇందులో ఎలాంటి రాజకీయ విషయాలు ప్రస్తావించడంలేదని కరణ్ అన్నారు. కాన్సెప్ట్ కొత్తగా అనిపించడంతో ఇందులో నటించడానికి ఒప్పుకున్నానన్నాడు. మరి ఈ స్టోరీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుందేమో!

 • విశ్వాసం నెగ్గగానే.. చిన్నమ్మ దర్శనానికి!
  Published Date : 17-Feb-2017 6:54:26 IST

  తమిళ రాజకీయాల్లో ఈ శనివారం అత్యంత కీలకమైనది కానుంది. వాడీవేడి రాజకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామి శనివారం బలనిరూపణకు సిద్ధం అవుతున్నాడు. పరిణామాలు చూస్తుంటే ఇతడికి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. బలపరీక్ష అనంతరం పళని చేయబోయే మొదటి పని పరప్పన అగ్రహార జైలును సందర్శించడమే అని తెలుస్తోంది. మరి విశ్వాస పరీక్ష ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా మారిందిప్పుడు. తన కూటమిలోని ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో నిమగ్నమయ్యాడు తమిళనాడు సీఎం.

 • తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ?
  Published Date : 17-Feb-2017 6:37:33 IST

  రాజకీయ పార్టీ పెట్టే సందర్భం, అవసరం వస్తే తప్పకుండా పెడతామని అన్నారు జేఏసీ చైర్మెన్ ప్రొఫెసర్ కోదండరాం. శుక్రవారం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో విలువలతో కూడిన రాజకీయ పార్టీల అవసరం ఉందని.. ప్రత్యామ్నాయ రాజకీయ విలువల కోసం జేఏసీ పోరాడుతోందన్నారు. ఒక వేళ పార్టీ పెట్టాల్సిన అవసరం, సందర్భం వస్తే తప్పకుండా పెడతామన్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినా.. జేఏసీ మాత్రం కొనసాగుతుందన్నారు. కోదండరాం వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.

 • తమిళనాట ఒక్కో ఎమ్మెల్యే రేటెంతంటే!
  Published Date : 17-Feb-2017 8:20:49 IST

  శశికళ ఎమ్మెల్యేల రిసార్ట్ క్యాంప్ పటిష్టంగా కనిపిస్తోంది. ఆమె జైలుకు వెళ్లినా పళనిస్వామికి అనుకూలంగా నిలబడుతున్నారు ఎమ్మెల్యేలు. మరి దీనికి గానూ ఒక్కో ఎమ్మెల్యేకూ ఐదుకోట్లు దక్కుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తంలో ఒప్పటికే ఒక్కోరికి మూడు కోట్లు ఇచ్చారని, విశ్వాస పరీక్ష తర్వాత రెండు కోట్ల మొత్తం ఇచ్చేట్టుగా అందరితోనూ ఒప్పందాలు కుదిరియానే మాట వినిపిస్తోంది. 120 మంది ఎమ్మెల్యేలు 600 కోట్లు.. ఇదే అక్కడి ప్రభుత్వాన్ని నిలబడుతోందనే మాట వినిపిస్తోంది. ఇది ప్రత్యర్థుల ప్రచారంగా ఆ వర్గం కొట్టిపడేస్తోంది.

 • హీరో,హీరోయిన్ల ప్రేమ నిజమే.. సహజీవనం కూడానా?
  Published Date : 16-Feb-2017 7:59:20 IST

  తామిద్దరం ప్రేమలో ఉన్నామనే విషయాన్ని ధ్రువీకరించాడు జై. గత కొన్నాళ్లుగా ఇతడు, హీరోయిన్ అంజలిల ప్రేమకథ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్న విషయం విదితమే. వీళ్ల ప్రేమకథ చాలా పాతదే అయినా.. ఈ మధ్య వీళ్లిద్దరూ దోసెలు వేస్తూ దిగిన ఫొటోలతో వ్యవహారం మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జై మాట్లాడుతూ.. ప్రేమ నిజమే అని స్పష్టం చేశాడు. ‘జర్నీ’ సినిమాలోలానే ఉంటామని అయితే రియల్ లైఫ్ లో అంజలి తనను కొట్టదని చమత్కరించాడు. మరి సహజీవనం గురించే క్లారిటీ ఇవ్వలేదు!

 • ట్రంప్.. భారత్ కు మేలే చేస్తున్నాడు!
  Published Date : 16-Feb-2017 7:58:30 IST

  ట్రంప్ రాక నిజంగానే అనుకోని మేలు చేయొచ్చు… అతి పెద్ద మార్కెట్ అయిన మనదేశ సమస్యలపై భారత ఐటీ పరిశ్రమదృష్టి పెట్టొచ్చు… అని అన్నారు ముకేశ్ అంబానీ. ట్రంప్ రక్షణాత్మక విధానాలతో దేశీ ఐటీ రంగానికి ఊహించని మేలే జరగవచ్చని అభిప్రాయపడ్డారు. దీనివల్ల భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు దేశీ మార్కెట్లో అవకాశాలపై దృష్టి పెట్టేందుకు తోడ్ప డగలదని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ సదస్సులో ఆయన పేర్కొన్నారు. ట్రంప్ ధోరణులు భారత ఐటీ రంగాన్నిఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో అంబానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

 • కాటమరాయుడు ఓవర్సీస్ రైట్స్.. రికార్డు స్థాయి ధరలో!
  Published Date : 16-Feb-2017 7:57:37 IST

  పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘కాటమరాయుడు’ ఓవర్సీస్ రైట్స్ ను రికార్డు ధరకు అమ్మినట్టుగా తెలుస్తోంది. అత్యంత భారీ స్థాయిలో ఏకంగా 11.5 కోట్ల రూపాయల ధరకు వీటిని సేల్ చేసినట్టు సమాచారం. ఈ సినిమా మాస్ ఎంటర్ టైనరే అయినా.. ఓవర్సీస్ విషయంలో ఇంత ధర పలకడం ఆసక్తికరంగా ఉంది. ఇటీవల ‘ఖైదీ-150’ సినిమా ఓవర్సీస్ లో 2.5 మిలియన్ల మొత్తాన్ని వసూలు చేయడం కాటమరాయుడు కు ఊపునిచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఆ స్థాయి వసూళ్లను సాధించగలిగితే.. పవన్ సినిమా హిట్టైనట్టు!

 • ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే కాంగ్రెస్ కు అన్ని సీట్లా!
  Published Date : 16-Feb-2017 7:56:55 IST

  తెలంగాణలో రాజకీయ పరిస్థితుల గురించి కొంత కాలం కిందట అధికార టీఆర్ఎస్ సర్వే చేయించుకుంటే.. 119 సీట్లకు గానూ వంద సీట్లు తమకే దక్కుతాయని తేలిందని వచ్చిందట. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్త సర్వేను తెరపైకి తెచ్చింది ఇప్పటిపరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే 50 సీట్లు కాంగ్రెస్ కు దక్కుతాయని ఈ సర్వేలో తేలిందట. కొంచెం గట్టిగా కష్టపడితే మరో ఇరవై సీట్లలో కాంగ్రెస్ పార్టీనే జయకేతనం ఎగరేసే అవకాశాలున్నాయని ఈ సర్వే తేల్చిందట! కాంగ్రెస్ సొంతం చేసుకున్న సర్వే ఆసక్తికరంగానే ఉంది.

 • శశి నేడే లొంగిపోతుందా? నెల రోజుల తర్వాతనా?
  Published Date : 15-Feb-2017 9:43:43 IST

  ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు దోషిగా నిర్ధారించడంతో శశికళ ముఖ్యమంత్రి కలలు కల్లలు అయ్యాయి. ఈమె శిక్షను అనుభవించడానికి జైలుకెళ్లకు తప్పేలా లేదు. మూడున్నర సంవత్సరాల జైలు శిక్షను అనుభవించాల్సి ఉన్న శశి నేడే లొంగిపోవచ్చనే మాట వినిపిస్తోంది. అయితే ఈ వెంటనే ఈమె కొంత విరామాన్ని కోరవచ్చనే మాట వినిపిస్తోంది. తన ఆరోగ్యం బాగోలేదని.. నెల రోజుల పాటు తనకు గడువు ఇవ్వాలని, ఆ తర్వాత శిక్షను అనుభవిస్తానని ఈమె కోర్టును కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 • మహేశ్ నో.. వెంకీ ఎస్.. అన్నాడా!
  Published Date : 15-Feb-2017 9:36:54 IST

  పూరీ జగన్నాథ్ కొన్నాళ్ల కిందట ‘జనగణమన’ అనే సినిమాను మహేశ్ హీరోగా తీస్తానని ప్రకటించాడు. మొదట్లో ఆ సినిమా పట్ల మహేశ్ కూడా సానుకూలంగా స్పందించాడనే వార్తలు వచ్చాయి. అయితే ఎందుకో ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఆ సినిమాకు టైమొచ్చిందనే మాట వినిపిస్తోంది. వెంకీ హీరోగా ఆ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రోగ్ సినిమాను పూర్తి చేశాడు పూరీ, వెంకీ కూడా గురు సినిమాను పూర్తి చేశాడు. ఈ నేపథ్యంలో వీరి కాంబోలో ఆ సినిమా వస్తుందనే మాట వినిపిస్తోంది.

 • పూరీ.. పాత సెంటిమెంటు వాడుతున్నాడు!
  Published Date : 15-Feb-2017 9:31:50 IST

  ‘ఇడియట్’ దర్శకుడు పూరీ, హీరో రవితేజల కెరీర్ ను మరో మలుపు తిప్పిన సినిమా. ఆ సినిమా ఉప శీర్షిక కూడా అప్పట్లో ఆసక్తిని రేకెత్తించింది. ‘చంటిగాడి ప్రేమకథ’ అనేది ఆ సినిమా క్యాప్షన్. మరి ఇప్పుడు దాన్ని మరో రకంగా వాడుతున్నాడు దర్శకుడు పూరీ. ఈ దర్శకుడి తాజా సినిమా ‘రోగ్’. తిట్టును టైటిల్ గా పెట్టే తన సెంటిమెంట్ ను కొనసాగిస్తున్న పూరీ.. ఈ సినిమాకు ‘మరో చంటిగాడి ప్రేమకథ’ అనే ఉపశీర్షికతో ఇడియట్ సెంటిమెంటు కొనసాగిస్తున్నాడు.

 • సింగం సీరిస్.. నాలుగో వెర్షన్ కూడా ఉందట!
  Published Date : 15-Feb-2017 9:28:58 IST

  సింగం-3 విజయవంతం అయ్యిందని.. దీనికి నాలుగో వెర్షన్ కూడా ఉందని ప్రకటించాడు ఆ సినిమా హీరో సూర్య. హరి దర్శకత్వంలో మూడు వెర్షన్లుగా విజయవంతం అయిన ఈ కథకు మరో సీక్వెల్ ఉంటుందని సింగం-4 గా ఆ సినిమా తెరకెక్కుతుందని సూర్య చెప్పాడు. అయితే దానికి కొంచెం సమయం పడుతుందని.. మరో నాలుగు సంవత్సరాల సమయం పట్టవచ్చని సూర్య వ్యాఖ్యానించాడు. విడుదల వాయిదా పడినా ఎస్-3 తమిళ, తెలుగు భాషల్లో విజయవంతం అయ్యందని ఈ హీరో చెప్పాడు.

 • ప్రభాస్ కొత్త సినిమా బడ్జెట్.. ఆ స్థాయిలోనా!
  Published Date : 14-Feb-2017 9:51:01 IST

  సుజిత్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రతిపాదనలో ఉండిన సినిమా ఎట్టకేలకూ ఆరంభం అయ్యింది. బాహుబలి-2 పనులను పూర్తి చేసుకన్న ప్రభాస్ ఇప్పుడు ఈ సినిమాపై దృష్టి పెట్టాడు. ‘రన్ రాజా రన్’ వంటి హిట్ సినిమాను రూపొందించిన సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా బడ్జెట్ విషయంలోనే స్టన్నింగ్ నంబర్స్ వినిపిస్తున్నాయి. దీన్ని ఏకంగా రూ.150 కోట్ల రూపొందిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారట!

 • మరోహీరోయిన్ నిర్మాతగా మారుతోందా!
  Published Date : 14-Feb-2017 9:48:37 IST

  ఈ మధ్య కాలంలో పలువురు బాలీవుడ్ భామమణులు నిర్మాతలుగా మారారు సినిమాలను రూపొందించారు. ప్రియాంక చోప్రా, అనుష్కా శర్మా, దియా మీర్జా ఈ జాబితాలోని వారే. వీరు మాత్రమే కాకుండా ఈ జాబితాలో కత్రినాకైఫ్ కూడా జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈమె నిర్మాతగా మారి సినిమాను రూపొందించనుందట. అందులో కత్రినా సోదరి ఇసబెల్లా ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉందట. ఈ విధంగా చెల్లెలును లాంఛ్ చేయడానికి నిర్మాత హోదాలో కథలు వింటోందట కత్రినా కైఫ్!

 • టెండూల్కర్ బయోపిక్ విడుదల తేదీ ఖరారు!
  Published Date : 14-Feb-2017 9:44:24 IST

  సచిన్ టెండూల్కర్ బయోపిక్ ‘సచిన్- ఏ బిలియన్ డ్రీమ్స్’ సినిమా విడుదల తేదీ ఖరారు అయ్యింది. ఈ ఏడాది మే ఇరవై ఆరో తేదీన ఈ సినిమా విడుదల కానుందని టెండూల్కర్ ట్విటర్ ద్వారా ప్రకటించాడు. ఈ మధ్య కాలంలో క్రీడాకారుల జీవిత కథల ఆధారంగా వచ్చిన పలు సినిమాలు విజయవంతం అయ్యాయి. అజహర్, ధోనీల జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలొచ్చాయి. ఈ నేపథ్యంలో టెండూల్కర్ బయోపిక్ కు మంచి ఆదరణ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.