• వర్మకు ఛాన్సిస్తానంటున్న సూపర్ స్టార్!
  Published Date : 19-Apr-2017 7:04:41 IST

  ఒకవైపు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై క్రిటిక్స్ వరసగా విరుచుకుపడుతూనే ఉన్నారు. వర్మ సినిమా తీయడమెలాగో మరిచిపోయాడని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఒక స్టార్ హీరో వర్మకు ఛాన్సిస్తానని ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది. ఆ హీరో మరెవరో కాదు.. మోహన్ లాల్. గతంలో వర్మతో కలిసి పని చేసిన నేఫథ్యం ఉంది లాల్ కు. కంపెనీ, ఆగ్ వంటి సినిమాల్లో నటించాడు లాల్. ఈ నేపథ్యంలో వర్మ దర్శకత్వంలో మరోసారి నటించడానికి సిద్ధమని ప్రకటించారీయన.

 • జగన్ మరో దీక్షకు రెడీ..!
  Published Date : 19-Apr-2017 7:01:22 IST

  వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల దీక్ష చేపడుతున్నారు. గుంటూరు వేదికగా ఈ నెల 26, 27 తేదీలలో జగన్ దీక్ష చేస్తారని వైకాపా ప్రకటించింది. ఒకవైపు పంటల దిగుబడి వచ్చి రైతులు తమ పంటలను అమ్ముకోడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఒక్కసారిగా వ్యాపారులు కుమ్మక్కై ధరలను తగ్గించడం.. అయినా ఈ అంశంపై ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆయన దీక్ష మొదలుపెడుతున్నట్టుగా ఆ పార్టీ ప్రకటించింది.

 • నంద్యాల టికెట్ మాదే.. స్పష్టం చేసిన మంత్రి!
  Published Date : 19-Apr-2017 6:58:48 IST

  నంద్యాల ఉప ఎన్నికలలో తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారంటూ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన ప్రకటన చేశారు. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విజయవాడ భవానీ ఐలండ్‌లో పర్యటించిన ఆమె.. పర్యాటకానికి సంబంధించిన విషయాలతో పాటు ఈ అంశంపై కూడా స్పందించారు. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఈ ఎన్నికలలో తమ కుటుంబం నుంచే పోటీ చేస్తారని, తన తల్లి శోభా నాగిరెడ్డి వర్ధంతి అయిన 24వ తేదీన అభ్యర్థిని ప్రకటిస్తామని ఆమె ఏకపక్షంగా ప్రకటించారు.

 • మోడీకి అక్కడ ఒక్క ఓటూ పడలేదు..!
  Published Date : 18-Apr-2017 12:33:09 IST

  అంతర్జాతీయ స్థాయిలో ఆన్ లైన్ సర్వే ద్వారా టైమ్ పత్రిక ఎంపిక చేసే అత్యంత ప్రభావశీల వ్యక్తుల ఎంపికలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఒక్క ఓటు కూడా పడలేదు. ఈ జాబితాలో ప్రస్తుతం ఫిలప్పైన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టో ముందున్నాు. అత్యధిక శాతం ఓట్లను ఈయనే పొందారు. అలాగే కెనడా ప్రధాని ట్రుడో, పోప్ ఫ్రాన్సిస్, బిల్ గేట్స్, జుకర్ బర్గ్ లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ట్రంప్ కు రెండు శాతం ఓట్లు లభించాయి. సత్యానాదెళ్ల, ఇవాంకాలకు ఒక్క ఓటూ పడలేదు.

 • రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి?
  Published Date : 18-Apr-2017 12:30:36 IST

  ఒకవైపు తమ వారిలో ఎవరిని రాష్ట్రపతిగా చేయాలో అర్థం కాని స్థితిలో కనిపిస్తోంది అధికార కూటమి. కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఇప్పటి వరకూ రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఒక అభిప్రాయానికి రాలేదు. వారి సంగతలా ఉంటే.. ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. శరద్ పవార్, గులాం నబీ ఆజాద్, కరణ్ సింగ్ ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయట. బీజేపీకి వ్యతిరేకంగా ఏకం కావాలనుకుంటున్న పక్షాలన్నీ ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించనున్నారట.

 • టీడీపీ, బీజేపీ, జనసేనలు.. మిత్రపక్షాలేనట..
  Published Date : 18-Apr-2017 12:28:21 IST

  తెలుగుదేశం నేత అయ్యన్న పాత్రుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన మిత్రపక్షాలే అని ఈయన స్పష్టం చేశాడు. తమ మధ్య మిత్రుత్వం కొనసాగుతోందని.. వచ్చే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలూ కలిసి పోటీ చేస్తాయని అయ్యన్న స్పష్టం చేశాడు. ఇదే జరుగుతుందని ఆయన నొక్కి వక్కాణించాడు. మంత్రి ఈ విధంగా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ఈ తెలుగుదేశం నేత మాటల పట్ల జనసేన అధినేత ఎలా స్పందిస్తాడో.. ఇప్పటికే తను బీజేపీకి దూరం అయినట్టుగా పవన్ ప్రకటించాడు మరి!

 • అబ్బే జనసేనలో చేరడం లేదు..!
  Published Date : 16-Apr-2017 10:11:38 IST

  తను జనసేనలో చేరడం లేదు అని అంటున్నాడు తెలుగుదేశం ఎమ్మెల్యేల బోండా ఉమ. చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో ఉన్నాడనే పేరును తెచ్చుకున్నాడు ఉమామహేశ్వరరావు. ఆ మధ్య అలిగాడు కూడా. అయితే బాబు పిల్చి కబ్జాల కథ గురించి ప్రస్తావించి.. వారించగా.. చల్లబడ్డట్టు సమాచారం. అయితే అప్పటికి సర్దుకుపోయినట్టుగానే ప్రకటన చేసినా.. ప్రస్తుతం ఈయన పవన్ కల్యాణ్ జనసేనలో చేరే యత్నంలో ఉన్నట్టు సమాచారం. క్యాస్ట్ ఈక్వెషన్స్ ప్రకారం ఈయన జనసేనలో చేరనున్నాడనే ఊహాగానాలున్నాయి.

 • మోహన్ బాబు ఆ తమిళ సినిమా రీమేక్?
  Published Date : 16-Apr-2017 10:09:10 IST

  తమిళంలో రాజ్ కిరణ్, ధనుష్ లు ప్రధాన పాత్రల్లో ధనుష్ తొలి సారి దర్శకత్వం వహించగా రూపొందిన సినిమా “పవర్ పాండి’’ అక్కడ విడుదలై పాజిటివ్ బజ్ తో విజయం దిశగా సాగుతున్న ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారని సమాచారం. తమిళంలో రాజ్ కిరణ్ చేసిన పాత్రను తెలుగు వెర్షన్ లో మోహన్ బాబు చేయనున్నారని సమాచారం. వయసు మీద పడిన రైతు పాత్రలో రాజ్ కిరణ్ కనిపించగా, ఆ రైతు యువకుడప్పటి పాత్రలో ధనుష్ నటించాడు. మరి మోహన్ బాబు, మరే హీరో కాంబోలో ఆ సినిమా తెలుగులో వస్తుందో చూడాలి.

 • పన్నీరు, పళని.. భాయీభాయీ?!
  Published Date : 16-Apr-2017 10:06:58 IST

  చూస్తుంటే తమిళనాట పన్నీరు సెల్వం, పళనిసామిలు రాజీ బాట పట్టేలా ఉన్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక రద్దు కావడంతో తమిళనాడు రాజకీయాల్లో మార్పు వచ్చేలా ఉంది. టీటీవీ దినకరన్ ఆధిపత్యాన్ని సహించలేని పళనిసామి పన్నీరుతో రాజీకి రంగం సిద్దం చేసుకుంటున్నట్టు సమాచారం. పార్టీకి మరో మూడేళ్ల వరకూ అధికారం ఉన్న నేపథ్యంలో అంతా సర్దుకుపోయి.. ముందుకు సాగుదామని వీరు భావిస్తున్నారని టాక్. ఎలాగూ శశి జైల్లో ఉంది. ఇప్పుడు టీటీవీని తోసేసి.. ఒక ఒడంబడికకు వచ్చి వీరు రాజీ పడతారని సమాచారం.

 • ఐపీఎల్ లో ఢిల్లీ జట్టుకే ఆడాలని ఉందన్న ఆటగాడు
  Published Date : 14-Apr-2017 7:35:34 IST

  ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తన చివరి మ్యాచ్ లను ఢిల్లీ జట్టుకే ఆడాలని ఉందని ప్రకటించాడు కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్. కేకేఆర్ కు జట్టుగా ఉన్నప్పటికీ తన మనసంతా ఢిల్లీ చుట్టూనే తిరుగుతూ ఉంటుందని ప్రకటించాడు గంభీర్. ఢిల్లీలోనే పుట్టి పెరిగిన గంభీర్ ఐపీఎల్ తొలి మూడు ఎడిషన్లనూ ఢిల్లీ జట్టుకే ఆడాడు. అనంతరం కేకేఆర్ జట్టు గంభీర్ ను కొనుక్కొంది. ఆ జట్టును కెప్టెన్ గా విజేతగా కూడా నిలిపాడు గంభీర్. అయినప్పటికీ తను ఢిల్లీ కుర్రాడిగానే ఆనందిస్తానని గంభీర్ చెప్పాడు.

 • పళనిస్వామి అంత పని పెట్టుకుంటాడా?
  Published Date : 14-Apr-2017 7:34:17 IST

  పేకమేడలాంటి ప్రభుత్వంతో రోజులు గడుపుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో డబ్బుల పంపకానికి సంబంధించి ఐటీ శాఖకు అన్నాడీఎంకే ఆధారాలతో సహా పట్టుబడటం తో మంత్రి విజయభాస్కర్ పై విచారణ సాగుతోంది. ఆయనను అరెస్టు కూడా చేయనున్నారని తెలుస్తోంది. ఆయనేగాక మరో ఇద్దరిని కూడా పళనిసామి మంత్రివర్గం నుంచి తొలగించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి అదే జరిగితే ప్రభుత్వ మనుగడ కూడా ప్రశ్నార్థకమే!

 • బీజేపీ వ్యతిరేక కూటమి దిశగా మాజీ సీఎం అడుగులు!
  Published Date : 14-Apr-2017 7:32:59 IST

  భారతీయ జనతా పార్టీ వ్యతిరేక కూటమిలో తనూ భాగస్వామిని అవుతానని ప్రకటించింది బీఎస్పీ అధినేత్రి మాయవతి. బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో జతకలుస్తానని ఆమె ప్రకటించింది. ఇటీవల యూపీలో ఎదురైన అత్యంత దారుణమైన ఓటమి అనంతరం.. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ కలిసి కూటమిగా ఏర్పడుతాయని ఊహాగానాలున్నాయి. వాటికి ఊతమిస్తూ.. మాయవతి ఈ ప్రకటన చేశారు. ప్రతిపక్షాల మహా కూటమిని ఏర్పరచాలని కమ్యూనిస్టు పార్టీలో సహా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ భావిస్తున్నాయి.

 • ఏదో ఒక రోజు హరీష్ రావు సీఎం అవుతాడు..!
  Published Date : 13-Apr-2017 8:30:42 IST

  మంత్రి హరీశ్‌రావు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి కావడం ఖాయమని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందన్నారు. కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కూతురు కవిత అవినీతికి పాల్పడుతూ మంత్రి హరీశ్‌ను ఒంటరి చేశారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ పాలనకు బుద్ధి చెప్పేవరకు ప్రజలు నిద్రపోరని, దీనికి తమ పాదయాత్ర నాంది పలుకుతుందని, 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వే ధీమా వ్యక్తం చేశారు.

 • మరో దర్శకుడు నిర్మాతగా…!
  Published Date : 13-Apr-2017 8:29:36 IST

  ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు నిర్మాతలుగా మారారు. ఈ జాబితాలోనే నిలుస్తున్నాడు శ్రీను వైట్ల. ప్రస్తుతం మిస్టర్ సినిమా విడుదల నేపథ్యంలో వైట్ల నిర్మాతగా మారుతుండటం వార్తల్లోకి వస్తోంది. మరి నిర్మాతగా వైట్ల ఏం తీయబోతున్నాడంటే.. టీవీ షో అని తెలుస్తోంది. అది కూడా కామెడీ షో అట. వైవా హర్ష ఆ షో ను నిర్వహిస్తాడని సమాచారం. మరి తెలుగు సినిమా చరిత్రలో కామెడీ విషయంలో వైట్ల ప్రత్యేకతను కలిగి ఉన్నాడు..బుల్లితెరపై ఆయన ఆధ్వర్యంలోని కార్యక్రమం ఎలా ఉంటుందో!

 • తమన్నా రెమ్యూనరేషన్ కు తట్టుకోలేకపోయాడట!
  Published Date : 13-Apr-2017 8:28:18 IST

  క్వీన్ సినిమా తమిళ రీమేక్ ఆగిపోవడం వెనుక అసలు కారణాన్ని వివరించాడు నిర్మాత త్యాగరాజన్. హిందీలో హిట్టైన ఈ సినిమాను తమన్నా తో దక్షిణాదిన తీయ సంకల్పించాడు ఆయన. అందుకు సంబంధించి ప్రకటన కూడా చేశాడు. అయితే.. ఉన్నట్టుండి ఆ సినిమా ఆగిపోయినట్టుగా ప్రకటన వచ్చింది. మరి దీని వెనుక కథేంటని ఆరా తీస్తే.. తమన్నా రెమ్యూనరేషన్ ను భరించలేకపోయినట్టుగా ఆ నిర్మాత తెలిపాడు. అయితే ఆ సినిమాను తెరకెక్కిస్తానని.. తగిన నటి దొరికాకా పట్టాలెక్కిస్తానని ఆయన ప్రకటించాడు.